కీసర ఎమ్మార్వో లంచం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు ఈ కేసులో పట్టుబడిన కీసర తహశీల్దార్ నాగరాజుతోపాటు శ్రీనాథ్‌యాదవ్, అంజిరెడ్డి పేర్లు బయటకు రాగా.. తాజాగా మరికొందరు రెవెన్యూ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతోపాటు కీసర ఆర్డీవో రవి పేర్లు తెరపైకి రావడం సంచలనంగా మారింది.
కోటీ 10 లక్షల లంచం కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఏసీబీ విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్, కీసర ఆర్డీవో ఆదేశాల మేరకే తాను రియల్టర్, మధ్యవర్తితో మాట్లాడేందుకు వెళ్లానని ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చాడు. భూ వివాదంలో కోటి 10 లక్షలతో పట్టుబడిన నాగరాజు సహ నిందితుల్ని కోర్టు అనుమతితో మూడు రోజులు కస్టడీకి తీసుకుని విచారించిన సమయంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు నిందితులు. వాంగ్మూలాలు రికార్డు చేసిన దర్యాప్తు అధికారులు ఏసీబీ కోర్టుకు సమర్పించారు. ఇక నాగరాజు మేడ్చల్ జిల్లా కలెక్టర్, కీసర ఆర్డీవో పేర్లు వెల్లడించడంతో ఈ కేసు తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది.
విచారణలో భాగంగా రియల్టర్ శ్రీనాథ్ యాదవ్ నుంచి లంచం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ఏసీబీ అధికారులు నాగరాజును ప్రశ్నించగా..శ్రీనాథ్‌కు సంబంధించిన వివాదాస్పద భూమి తన పరిధిలో లేదని, అతనికి ఎలాంటి అధికారిక సహకారం అందించే అవకాశం లేదని తెలిపారు. మేడ్చల్ కలెక్టర్, కీసర ఆర్డీవో సూచన మేరకు ఆగస్టు 14న భూమి విషయమై మాట్లాడేందుకు గెస్ట్‌హౌ్‌సకు వెళ్లానని చెప్పారు. తన కార్యాలయ పనిగంటలు ముగిసిన తర్వాత వారితో మాట్లాడేందుకు గెస్ట్‌హౌ్‌సకు వెళ్లానని, ప్రైవేట్ రూంలో మాట్లాడేందుకు సిద్థమవుతున్న సమయంలోనే తనను పట్టుకున్నారని వాంగ్మూలం ఇచ్చారు. కలెక్టర్, ఆర్డీవో సూచన మేరకే వెళ్లానని ఏసీబీ విచారణలో పదేపదే స్పష్టం చేశారు నాగరాజు.
ఇదిలా ఉంటే..కస్టడీలో నాగరాజు తమకు ఏ మాత్రం సహకరించలేదని, అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని ఏసీబీ అధికారులు కోర్టుకు వివరించారు. బ్యాంకు లాకరు, తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు ఆయన ముందుంచి ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన పేర్ల ఆధారంగా ఈ కేసులో జిల్లా ఉన్నతాధికారులను విచారించేందుకు ఏసీబీ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
అయితే ఎమ్మార్వో ఆరోపణలను కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవి ఖండించారు. కీసర ఎమ్మార్వో లంచం తీసుకున్న వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాలపై స్పందించాల్సిన అవసరం లేదని..చట్టపరంగా ముందుకువెళ్తామని స్పష్టం చేశారు.