కేసీఆర్ ఫొటో తొలగింపుపై కవిత క్లారిటీ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కవిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాగృతి పోస్టర్లలో ఇక నుంచి కేసీఆర్ ఫొటో ఉపయోగించబోమని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు BRS సీనియర్ నేతలపై కవిత విమర్శలు చేయడంతో కేసీఆర్ సీరియస్ అయ్యారు. BRS పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. వెంటనే కవిత కూడా తన MLC పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ జాగృతి ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్ ఫొటోను మాత్రం పోస్టర్లలో వాడుకున్నారు.
ఈ నెల 25 నుంచి ‘జాగృతి జనం బాట’ కార్యక్రమం మొదలుకానుంది. అందుకు సంబంధించిన పోస్టర్లను కవిత ఆవిష్కరించారు. అయితే పోస్టర్లలో కేసీఆర్ ఫొటో ఎక్కడా కనిపించలేదు. ఇదే అంశంపై కవిత ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి కేసీఆర్ ఫొటో లేకుండానే జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని.. ఆ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారన్నారు కవిత. తాను తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటానన్నారు. తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేసే.. ఈ ప్రయత్నంలో కేసీఆర్ ఫొటో వాడడం నైతికంగా సరికాదన్నారు. తాను చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాదన్నారు. చెట్టు నీడన ఉండి.. ఆ చెట్టును దుర్మార్గుల నుంచి కాపాడే ప్రయత్నం చేశానన్నారు.
కేసీఆర్ ఫొటో లేకుండానే ఇక నుంచి జాగృతి కార్యక్రమాలు ఉంటాయని కవిత చెప్పడంపై BRS నేతలు స్పందిస్తారో లేదో చూడాలి.
Previous articleఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కంటెంట్‌పై మెటా ప్రకటన
Next articleపోటీ నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిశోర్.. కారణమేంటి?