జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తొలి 6 రోజుల్లో 94 మంది నామినేషన్లు వేయగా.. నిన్న ఒక్క రోజే 120కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ వేసేందుకు నిన్న మధ్యాహ్నం 3 గంటలకే గడువు ముగిసింది. అయితే ఆ సమయంలోపే నామినేషన్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావడంతో రిటర్నింగ్ అధికారి టోకెన్లు ఇచ్చి వరుస క్రమంలో నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇచ్చారు. అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని యాచారంలోని ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులు, ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణలో భూములు కోల్పోనున్న వారు.. ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ నిరుద్యోగ జేఏసీ, ఎస్సీ వర్గీకరణకు నిరసనగా మాలసంఘాల జేఏసి ప్రతినిధులతో పాటు పలువురు నామినేషన్లు వేసేందుకు వచ్చారు.
అయితే ఎంత మంది పోటీలో ఉన్నా EVMలతోనే ఎన్నికలు జరుగుతాయని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన M3 EVMపై గరిష్ఠంగా 384 మంది అభ్యర్థుల పేర్లను చేర్చవచ్చని గుర్తుచేస్తున్నారు.
మరోవైపు అభ్యర్థుల నామినేషన్లను ఇవాళ అధికారులు పరిశీలిస్తారు. ఇప్పటికే BRS పార్టీ ఇద్దరు అభ్యర్థులతో నామినేషన్ వేయించింది. BRS అభ్యర్థులుగా మాగంటి గోపీనాథ్ భార్య సునీత, PJR కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఒకవేళ మాగంటి సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే.. ఆ పార్టీ నుంచి విష్ణువర్థన్ రెడ్డి పోటీలో ఉంటారు.
మాగంటి సునీత నామినేషన్‌కు ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత విష్ణువర్థన్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే అధికారులు ఇవాళ మాగంటి సునీత నామినేషన్ పరిశీలించి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని BRS శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.