జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్ మొదలైంది. నవంబరు 11న పోలింగ్.. 14న కౌంటింగ్ జరుగుతుంది. ఈ నెల 13న నోటిఫికేషన్ వెలువడనుంది. అప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 21 వరకు ఉంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారత రాష్ట్ర సమితి (BRS).. ఎలాగైనా విజయం సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని BJP వ్యూహాలు రచిస్తున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జూబ్లీహిల్స్‌కు జరగనున్న ఈ ఉప ఎన్నిక రెండోది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు మొదటి ఉప ఎన్నిక జరిగింది. భారత రాష్ట్ర సమితి నుంచి గెలుపొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీగణేష్ విజయం సాధించారు.
జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందిన BRS MLA మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. గోపీనాథ్ వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. 2014లో TDP నుంచి.. 2018, 2023లో భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన భార్య మాగంటి సునీతను భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ప్రకటించింది.
ఇప్పటికే ఈ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టికెట్ ఆశిస్తున్నారు. రహ్మత్‌నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన సీఎన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉండటంతో తనకు టికెట్ ఇవ్వాలని CN రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్‌లకు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించారు.
BJP బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఇప్పటికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో రహ్మత్‌నగర్, బోరబండ, షేక్‌పేట, వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ డివిజన్లు ఉన్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు ఎంఐఎం, నాలుగు భారత రాష్ట్ర సమితి దక్కించుకున్నాయి.