మెటా సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్. దీనిలో టీనేజ్ యూజర్లకు అందుబాటులో ఉండే కంటెంట్‌పై పరిమితులు విధించనుంది. అతి హింసాత్మక సన్నివేశాలు, అశ్లీల కంటెంట్, డ్రగ్స్ వాడకం, అసభ్య పదజాలం వంటి అంశాలను నియంత్రించనుంది.
గతేడాది నుంచి టీన్ అకౌంట్లపై తీసుకొస్తున్న భద్రతా చర్యల్లో ఇది అత్యంత ప్రధానమైన అప్డేట్ అని మెటా స్పష్టం చేసింది. దీని ద్వారా ఇప్పటికే ఉన్న ఆటోమేటిక్ ప్రొటెక్షన్లను బలోపేతం చేస్తూ, మరింత కఠినమైన ఫిల్టరింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. టీనేజర్లకు సురక్షితమైన, వయసుకు తగిన కంటెంట్ అందిస్తూ.. తల్లిదండ్రులకు మరింత నియంత్రణ ఇచ్చే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైందని కంపెనీ తెలిపింది.
సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ వల్ల మైనర్లు ప్రభావితం అవుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకుంది.