ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను టార్గెట్ చేస్తూ వైరస్ తయారీదారులు ఎప్పటికప్పుడు తమదైన స్టైల్లో రెచ్చిపోతున్నారు. మరి మొబైల్‌లో వైరస్ ఉన్న విషయం ఎలా గుర్తించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
మీ మొబైల్లో వాట్సాప్, ఫేస్‌బుక్, జీ మెయిల్ లాంటి అప్లికేషన్స్ ఉపయోగిస్తున్నప్పుడు లేదా సెట్టింగ్స్, హోమ్ స్క్రీన్ వంటి ఆప్షన్లు ఉపయోగించినప్పుడు మీ ప్రమేయం లేకుండా స్క్రీన్ మీద యాడ్స్, ముఖ్యంగా పాపప్ యాడ్స్ ఎక్కువగా వస్తున్నట్లైతే కచ్చితంగా మీ మొబైల్‌లో మాల్‌వేర్ ప్రొగ్రాం ఉన్నట్లు భావించాలి. కొన్ని సందర్భాలలో ఇటీవలే ఇన్‌స్టాల్ చేసిన ఏదైనా అప్లికేషన్ వల్ల కూడా ఇలాంటి యాడ్స్ కనిపించడం మొదలుపెడతాయి.
మీ మొబైల్‌లో మాల్‌వేర్ ఉన్నప్పుడు అది బ్యాక్ గ్రౌండ్‌లో అనేక రకాల పనులు చేస్తూ ఉంటుంది. ఇలా నిరంతరం అదనంగా ప్రాసెస్‌లు రన్ చేయడం వల్ల మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.
మొబైల్‌లో ఎలాంటి అప్లికేషన్స్ కావాలన్నా మనం ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటాం. కానీ మాల్‌వేర్ మొబైల్‌లో ఉంటే మాత్రం మీ ప్రమేయం లేకుండానే కొన్ని అప్లికేషన్స్ డౌన్‌లోడ్ అవుతుంటాయి. ముఖ్యంగా వీటిలో అధిక శాతం స్పై వేర్ ప్రొగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి మీకు తెలియకుండా ఏదైనా అప్లికేషన్ ఇన్‌స్టాల్ అవుతుంటే అప్రమత్తం కావడం మంచిది.
మీ మొబైల్‌లో డేటా లేదా వైఫై డేటా వినియోగం ఒక్కసారిగా పెరిగిపోతోందా.. అయితే మీ మొబైల్‌లో మాల్‌వేర్ ఉంది అన్న దానికి అదే సంకేతం.
అయితే మొబైల్‌లో మాల్‌వేర్ ఉంది అని అనుమానం వచ్చిన వెంటనే తప్పనిసరిగా యాంటీ వైరస్ ఇన్‌స్టాల్ చేసుకోండి. కొంతమేరకు సెక్యూరిటీ కల్పిస్తుంది. మాల్‌వేర్‌ను పూర్తిగా తొలగించాలంటే అన్నింటికంటే ఉత్తమ పరిష్కారం మీ మొబైల్ ఫ్యాక్టరీ రీసెట్ చేయటం. ఈ జాగ్రత్తలతో మీ మొబైల్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు.