హర్యానా సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను సెలవుపై పంపించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రోహ్‌తక్ ఎస్పీ నరేంద్రను ఉన్నతాధికారులు ట్రాన్స్‌ఫర్ చేశారు.
పూరన్ ఆత్మహత్యకు సంబంధించిన FIRలో డీజీపీ శత్రుజీత్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర పేర్లను చేర్చాలంటూ ఆయన భార్య సీనియర్ IAS అధికారిణి అమ్నీత్ కుమార్ డిమాండ్ చేశారు.
52 ఏళ్ల పూరన్ కుమార్ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇటీవల చండీగఢ్‌లోని తన నివాసంలో ఆయన రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కుల వివక్ష, వేధింపులు, అవమానాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో స్పష్టం చేశారు. ఎనిమిది మంది అధికారుల పేర్లను చేర్చారు. వారిపై చర్యలు తీసుకుంటేనే.. పూరన్ కుమార్ అంత్యక్రియలకు అనుమతిస్తామని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఈ కేసు ఎంక్వైరీ కోసం చండీగఢ్ పోలీసులు ఆరుగురు సభ్యులతో కూడిన స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు.