టీఆర్ఎస్ ప్రస్థానంపై హరీష్ రావు రాసిన సువర్ణాక్షరాలు

0
తెలంగాణా ప్రజలు తమను తాము పరిపాలించుకోవాలనే ఆకాంక్షకు రాజకీయ వ్యక్తీకరణగా తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భవించింది ఈ ఇరవై ఏండ్లలో చరిత్ర గతినే మార్చి వేసి, చిరకీర్తిని సంపాదించుకున్నది. అంధ్ర వలస వాదం సుడిగాలిలో తెలంగాణా అస్తిత్వస్పృహ ఆరిపోకుండా ఉండటానికి ఎందరో కృషి చేసారు. 1969 ఉద్యమం అనగారిపోయిన తరువాత ఎప్పటికైనా తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భావిస్తాడని ఆశగా ఎదురు చూసారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. గులాబీ జెండాను చేత పూనిన ఒక ధీరోదాత్తుడు ఆవిర్భవించి తెలంగాణాను విముక్తం చేసాడు. రెండు దశాబ్దాలుగా తెలంగాణా జనం కలలోను మెలకువలోను జపిస్తున్న మూడక్షరాల పేరు కేసీఆర్.
అందరూ చరిత్ర నుంచి ప్రభావితమౌతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. తెలంగాణా సమాజాన్ని ఊగించి, ఉరికించీ, దీవించి, శాసించి విజయ తీరం చేర్చిన మహానాయకుడు కేసీఆర్. ఆయన ఉన్నత వ్యక్తిత్వం ముందు, ఆయన ఉక్కు సంకల్పం ముందు, ఆయన వ్యూహ చతురత ముందు ఆ విధి సైతం తలవంచింది. తెలంగాణా ఆవిర్భవించింది
గులాబీ జెండా సంపన్న వర్గాల, కులాల అధికార వాంఛలో పుట్టలేదు. వెనుకబడిన తెలంగాణా వేదనలో పుట్టింది. అచంచల దీక్షతో సిద్దాంత బలంతో ముందుకు ఉరికింది. సుశిక్షితులైన కార్యకర్తలే పునాదిగా పురోగమించింది. ధనబలం ఉన్న పార్టీలను జనబలంతో ఎదిరించింది. మాఘలో పుట్టి పుబ్బలో పోతుందాని అవహేళన చేసిన పార్టీలను అదృశ్యం చేసింది. స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసింది. సుపరిపాలనను చవిచూపింది. చెక్కు చెదరని స్థైర్యం తో విజయపరంపరను కొనసాగిస్తున్నది. ఇది చరిత్రకందని అద్భుతం.
డిప్యూటి స్పీకర్ పదవి మొదలుకొని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కేంద్ర మంత్రి వంటి పదవులను ప్రజల ఆకాంక్ష కోసం కోసం తృణప్రాయంగా వదిలిన ఘన చరిత్ర తెరాస సొంతం. ఆ త్యాగమే పార్టీని ప్రజలకు దగ్గర చేసింది. భావజాల ప్రచారం, ఉద్యమ కార్యాచరణ. రాజకీయ సమరం మూడు కోణాలలో కేసిఆర్ గారు పార్టీని నడిపించిన తీరు అనితర సాధ్యం.
టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైన రోజున దేశంలో అన్ని పార్టీలు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం. 14 ఏండ్ల పోరాటం తర్వాత దాదాపు అన్ని పార్టీలు అనుకూలం. వ్యవస్థలేవైనా తెలంగాణాకు అనుకూలంగా మారవలసిన అనివార్యతను సృష్టించిన రాజకీయ యోధుడు కేసీఆర్.
ఈ ప్రయత్నం లో ఆయనకు ఆచార్య జయశంకర్ గారు తోడుగా నిలిచారు. తెలంగాణా ఏర్పాటును వాయిదా వేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒకవైపు, ఉద్యమాన్ని దెబ్బతీయాలనే తెలుగుదేశం ఇంకొక వైపు, ఈ రెంటినీ మట్టి కరిపించి టీఅర్ఎస్ అజేయంగా నిలిచింది, సమైక్య వాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించి తుదముట్టించింది. రాజకీయ పద్మవ్యూహాన్ని చేదిస్తూ, అడుగడుగునా అడ్డుపడే సైంధవులను ఓడిస్తూ, కేసీఆర్ గారు ఉద్యమాన్ని విజయతీరం చేర్చారు.
విజయాన్ని అందరూ సొంతం చేసుకుంటారు. అపజయం ఎప్పుడూ అనాథ. జయాపజయాలను సమంగా స్వీకరించిన స్థిరచిత్తుడు కేసిఅర్. రాళ్ళు విసిరిన చేతులే ఒకనాడు పూలు చల్లుతాయనే నమ్మకంతో ఆయన ముందడుగు వేసారు. తిట్టిన నోళ్లె పొగిడే స్థాయిలో, ఆకాశమంత ఎత్తుకు పార్టీని పెంచారు. ఇందుకోసం ఆయన కఠోర క్రమశిక్షణ పాటించారు. అందరికీ అది అలవాటు చేసారు. అధ్యయన శీలత అంటే ఏమిటో, రాజకీయ నాయకునికి అది ఎంత అవసరమో ఆయన నిరూపించారు. పార్టీలో ప్రతి ఒక్కరు ప్రజల సమస్యలని అధ్యయనం చేసేలా, వివిధ వేదికల మీద ప్రతిభావంతంగా వాదన వినిపించగలిగేలా నాయకులను, కార్యకర్తలకను తయారుచేసారు. ఆయన అడుగుజాడలో పార్టీలో బలమైన నాయకత్వం ఎదిగింది. అది శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. పార్టీని పటిష్ట పరిచింది.
రాజకీయ నాయకులు సాధారణంగా రాజకీయ సంబంధాలకే పరిమితమౌతారు, టిఆర్ఎస్ పార్టీకి పౌర సమాజంతో సంబంధాలు నెలకొల్పడంలో కేసిఆర్ కొత్త ఒరవడిని నెలకొల్పారు. ఆయన మేధావులలో మేధావి, కవుల మధ్య కవి, కళాకారులతో ఉంటే కళాకారుడు. అదే విధంగా పత్రికా సంపాదకులకు పాత్రికేయులకు ఉద్యోగులకు కార్మికులకు కర్షకులకు అందరికీ పార్టీతో ఉద్యమ సంబంధం ఆయన వల్ల కలిగింది. విద్యార్థి ఉద్యమానికి దిశానిర్దేశనం చేసారు. బిందువుగా ప్రారంభమైన పార్టీ నేడు సింధువుగా మారింది. గులాబీ జెండా ఒక పార్టీ జెండా గా కాకుండా తెలంగాణా జెండాగా మారడానికి కర్తగా కేసీఆర్ నిలిచారు. కర్మ క్రియలుగా కార్యకర్తలు నిలిచారు.
రెండు దశాబ్దాలు రెండు లక్ష్యాలు. మొదటి లక్ష్యం తెలంగాణా సాధన పూర్తయ్యింది రెండో లక్ష్యం బంగారు తెలంగాణా నిర్మాణమవుతున్నది. ఉద్యమాన్ని ఎంత నిబద్ధతతో నడిపించారో, ప్రభుత్వాన్ని అంతే నిబద్ధతతో నడిపిస్తున్నారు. అయనకు ప్రజలే ఊపిరి. ప్రజలకు ఆయనే దిక్సూచి. తెలంగాణా ఆయనలో నూతన భవిష్యత్తును దర్శిస్తున్నది. ఆయన ఆలోచనలో వెలుగులో, ఆయన వలెనె నిష్కామ కర్మ సాగిస్తూ, టిఆర్ఎస్ ను ప్రజల పార్టీగా నిలబెట్టడానికి ప్రతి కార్యకర్త పునరంకితం కావాలి. రెండు దశాబ్దాల ఘన చరిత్రను సగర్వంగా స్మరించుకుంటూ, ఈ వార్షికోత్సవ శుభవేళ అందరికీ నా శుభాభివందనాలు తెలియ జేస్తున్నాను. సత్యమే దైవంగా, సేవనే మార్గంగా, త్యాగమే ఆభరణంగా, తెలంగాణా సమగ్ర నిర్మాణమే ధ్యేయంగా, సమతా భారతమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో మరో ఉజ్వల ప్రస్థానాన్ని కొనసాగిద్దాం. గుండె గుండెలో గులాబీ పూవులు పూయిద్దాం.

తన్నీరు హరీశ్ రావు
    (రాష్ట్ర ఆర్థిక మంత్రి)

Previous articleకరోనా వైరస్ వ్యాప్తిపై మరో సంచలన విషయం బయటపెట్టిన శాస్త్రవేత్తలు
Next articleబీ కేర్‌ఫుల్: కరోనా వైరస్ సోకిన వారిలో మరో ఆరు లక్షణాలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here