రెండేళ్లలో ఐదుగురు ప్రధానులు రాజీనామా

ఫ్రాన్స్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొత్త ప్రధాని సెబాస్టియన్‌ లెకోర్ను తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్‌ 9న బాధ్యతలు చేపట్టిన సెబాస్టియన్ నెలలోపే ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌కు అత్యంత సన్నిహితుడు సెబాస్టియన్‌. గత నెలలో జాతీయ అసెంబ్లీలో జ‌రిగిన విశ్వాస ప‌రీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌ ఓడిపోవడంతో.. సెబాస్టియన్‌ను తదుపరి ప్రధానిగా అధ్యక్షుడు మాక్రన్ నియమించారు.
సెబాస్టియన్‌ ఆదివారం కొత్త క్యాబినెట్‌ను ఏర్పాటు చేయగా.. కూర్పుపై రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దీంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. దానిని మెక్రాన్ కూడా ఆమోదించారు. బడ్జెట్‌ సమస్యలు, ఉక్రెయిన్‌ యుద్ధం, గాజా పరిస్థితి, అమెరికా అధ్యక్షుడి విధానాలతో ఏర్పడ్డ గందరగోళం కారణంగా ఫ్రాన్స్‌ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇక ఫ్రాన్స్‌లో సెబాస్టియన్‌తో కలిపి రెండేళ్లలో ఐదుగురు ప్రధానులు రాజీనామా చేశారు.
ప్రధాని నియామ‌కం మాక్రన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఆయ‌న దగ్గర రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కొత్త ప్రధానిని నియ‌మించ‌డం లేదా జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేసి మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వహించ‌డ‌ం. గత రెండేళ్ల నుంచి ఇదే సమస్య వస్తున్నా.. ఎన్నిక‌లు నిర్వహించేందుకు మాత్రం దేశాధ్యక్షుడు మొగ్గు చూప‌లేదు. ఒక‌వేళ ఎన్నిక‌ల‌కు వెళ్తే, ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసిన 29 నుంచి 49 రోజుల మ‌ధ్య ఎన్నిక‌లు నిర్వహించాల్సి ఉంటుంది. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ నుంచి ప్రధాని వ్యక్తిని అధ్యక్షుడు నియ‌మిస్తారు.
Previous articleబిహార్‌తో పాటు జూబ్లీహిల్స్ షెడ్యూల్ వచ్చేసింది
Next articleకారు ప్రమాదంపై విజయ్‌ దేవరకొండ ట్విట్