బ్లూ జెర్సీలో మాయ చేయకున్నా.. ఇక పసుపు జెర్సీలో మహీ మ్యాజిక్

1
సూపర్ సిక్సర్లు, మెరుపు స్టంపింగ్స్, హెలికాప్టర్ షాట్లతో పదహేరేండ్ల పాటు భారత అభిమానులను ఉర్రూతలూగించిన ఓ అద్భుతం తన ప్రయాణాన్ని చాలించింది. ఇన్నాళ్లు టీమ్ కు వికెట్ల వెనుక వెన్నెముకలా నిలిచిన ఆ మాస్టర్ మైండ్ ఇక విరామం తీసుకుంది. దూకుడైన బ్యాటింగ్, వ్యూహరచనతో టీమ్ కు ఎన్నో చిరస్మణీయ విజయాలను అందించిన ఆ దిగ్గజం ఇక బ్లూ జెర్సీని వదిలేసింది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా కర్మయోగిలా ఆ నిష్క్రమణ సాగింది.
ధోనీ ఉన్నాడంటే.. భారత్ విజయం సాధిస్తుందనే ధీమా.. వికెట్ల వెనుక మహీ నిల్చున్నాడంటే.. ప్రత్యర్థి పనైపోయినట్లే అని భరోసా..సారథిగా వ్యూహం పన్నాడంటే.. మ్యాచ్ మన వశమైనట్లే అనే నమ్మకం.. దశాబ్దంన్నర పాటు అశేష అభిమానుల మనసులు గెలిచిన మహేంద్రసింగ్ ధోనీ..యువతరానికి దారి వదులుతూ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడు. ప్రపంచ క్రికెట్ లో అంతలా తన ముద్రవేసిన మహీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం పెద్ద షాక్ అనే అనాలి. మిస్టర్ కూల్, మాస్టర్ మైండ్, అపర చాణక్యుడు, క్రికెట్ మేధావి ఇలా పేరేదైనా రూపం మాత్రం ఒక్కటే. జట్టులో అందరికంటే వేగంగా పరిగెత్తగలిగినంత కాలం కొనసాగుతానని ఓ సందర్భంలో పేర్కొన్న మహీ.. అదే జోరులో ఉండగానే తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.
2004లో బంగ్లాదేశ్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ అడుగుపెట్టిన ధోనీ.. పరుగులేమీ చేయకుండా రనౌట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వికెట్ల మధ్య పరుగు తీయడంలో ప్రపంచ మేటీగా గుర్తింపు సాధించిన మహీ.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ రనౌట్ కావడం గమనార్హం. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో రనౌట్ అయిన ధోనీ ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టలేదు. కంప్యూటర్ ప్రాసెసర్ కంటే వేగంగా మైదానాల్లో నిర్ణయాలు తీసుకొని జట్టుకు విజయాలు కట్టబెట్టిన ధోనీ.. రిటైర్మెంట్ విషయంలోనూ మళ్లీ అదే పంథాను అవలంభించాడు. ఆడంబరాలకు దూరంగా ఉండే లక్షణాన్ని కొనసాగిస్తూ.. వీడ్కోలు మ్యాచ్ సైతం ఆశించకుండా కర్మయోగిలా టీమ్ కు దూరమయ్యాడు.
కెరీర్ తొలినాళ్లలో జులపాల జుట్టు..జార్ఖండ్ డైనమైట్.. టార్జన్ అంటూ వార్తల్లో నిలిచిన ధోనీ.. అరంగేట్రం చేసి మూడేండ్లు తిరగక ముందే.. జట్టు పగ్గాలు చేపట్టాడు. తన నాయకత్వ ప్రతిభతో దాదా వారసుడిగా ఎన్నికైన మహీ.. తొలి టోర్నీలోనే యువ ఆటగాళ్లతో కూడిన జట్టును టీ20ల్లో ప్రపంచ చాంపియన్ గా నిలబెట్టాడు. 2011 వన్డే ప్రపంచకప్ పాటు 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో హెలికాప్టర్ షాట్ ద్వారా ధోనీ సిక్సర్ బాది దేశానికి రెండో సారి ప్రపంచకప్ అందించిన క్షణాలను ఎవరు మరిచిపోలేరు. అతడి కెప్టెన్సీలోనే టీమ్ తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్ నంబర్ వన్ గా నిలిచింది.
అయితే మహీ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలకడంతో ఐపీఎల్ ఇక పూర్తిస్థాయి దృష్టి పెట్టే అవకాశం ఉంది. నీలిరంగులో మాయ చేయకున్నా..ఇక పసుపు జెర్సీలో ధోని మ్యాజిక్ మరికొంత కాలం పాటు చూసే అవకాశం ఉండటం కాస్తలో కాస్త సంతోషించాల్సిన విషయం. ఐపీఎల్ శిక్షణ శిబిరం కోసం చెన్నైలో ఉండే ధోని రిటైర్మంట్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. గతేడాది జూలై 10న వన్డే ప్రపంచకప్ సెమీఫైనలే ధోనీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్. మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ దుమ్మురేపి మళ్లీ ధోనీ జట్టులోకి వస్తాడనుకున్న అభిమానులకు నిరాశే ఎదరైంది. టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాది వాయిదా పడడం కూడా ధోనీ నిష్క్రమణకు కారణమై ఉండొచ్చు. ఏదిఏమైన క్రికెట్ లో ఓ శకం ముగిసింది. ఓ అద్భుతం తన మాయాజాలన్ని ఆపేసింది.
Previous articleరష్యా వ్యాక్సిన్ వచ్చేసింది.. కానీ ఇండియా రియాక్షన్ మాత్రం..
Next articleవారం రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధర.. దీపావళి నాటికి ఎంత అవుతుంది..?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here