CM Revanth Reddy: ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ధి పనులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని CM రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి మూసీ నది పునరుజ్జీవం అత్యంత కీలకమన్నారు.
❇️ శాసనసభలో మూసీ పునరుజ్జీవం అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్‌కు సంబంధించిన విస్తృత లక్ష్యాలు, ఉద్దేశాలను సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
❇️ అభివృద్ధి చెందిన నగరాలను అధ్యయనం చేసిన తర్వాత మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం క్లారిటీ ఇచ్చారు.
❇️ ప్రపంచ వ్యాప్తంగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే మానవ నాగరికత అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌కు సంబంధించి నిజాం హయాంలోనే మూసీ తీరం వెంబడి గొప్ప అభివృద్ధి జరిగిందని సీఎం గుర్తుచేశారు. 1908 వరదల అనంతరం హైదరాబాద్ నగరానికి శాశ్వత పరిష్కారంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు.
❇️ మూసీ నది కాలుష్యం వల్ల పరివాహక ప్రాంతాల్లో పర్యావరణం, ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోందని, ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం కన్సల్టెన్సీలను నియమించి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
❇️ బాపూ ఘాట్ వద్ద మూసా – ఈసా నదుల సంగమంలో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్ముడి విగ్రహాన్ని నెలకొల్పే ప్రాంతం గాంధీ సరోవర్‌ను ‘V’ ఆకారంలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మొత్తం 20 టీఎంసీలలో 15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5 టీఎంసీలను మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేందుకు వినియోగించనున్నట్లు చెప్పారు.
❇️ ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) 4 వేల కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించిందని, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అవసరమైన అనుమతులు లభించాయని సీఎం తెలిపారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కూడా ప్రణాళికలో ఉందన్నారు.
❇️ మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదలకు మెరుగైన నివాసాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఓల్డ్ సిటీ సహా నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంచిరేవుల సమీపంలో ఉన్న పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, మూసీ తీరం వెంబడి వివిధ ప్రాంతాల్లో గురుద్వారా, మసీదు, చర్చి నిర్మాణాల ద్వారా మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
❇️ డీపీఆర్ సిద్ధమైన తర్వాత అసెంబ్లీ ముందు పెడతామని, దానిపై ప్రజాప్రతినిధులు, నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళతామని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూలంగా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Previous articleమేడారం మహా జాతర మంగ్లీ పాట
Next articlePawan Kalyan: రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్..