కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటినీ అతలాకుతలం చేస్తోంది. వైరస్ దెబ్బకు దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ‘హెలికాప్టర్ మనీ’ అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి వీడియోకాన్ఫరెన్స్‌లో సూచించారు.
దీంతో “హెలికాప్టర్ మనీ” అంటే ఏమిటన్న చర్చ మొదలైంది. ఆర్థిక పరిభాషలో అత్యంత అరుదైన పదం ఇది. కేంద్ర ప్రభుత్వాలు, బ్యాంకులు నగదు నిల్వలను మార్కెట్‌లోకి తీసుకురావడాన్ని “హెలికాప్టర్ మనీ” అంటారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు వారికి తక్కువ వడ్డీకి నగదు అందజేస్తారు. వస్తువుల రేట్లు పడిపోయి మార్కెట్లు సంక్షోభంలోకి జారకుండా ఆర్థిక సమతుల్యత సాధించడం “హెలికాప్టర్ మనీ” ఉద్దేశం.
చరిత్రలో మొదటిసారి ప్రముఖ ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రైడ్‌మన్ 1969లో “హెలికాప్టర్ మనీ” విధానాన్ని ప్రతిపాదించారు. కానీ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ బెన్ బెర్నాంకి దీనిని 2002లో ప్రాచుర్యంలోకి తెచ్చారు. కాగా 2003లో జపాన్ సంక్షోభ సమయంలో దీనిని ఉపయోగించారు.