తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ.. ఇక భారత రాష్ట్ర సమితి (BRS)గా మారనుంది. ఈ మేరకు ఎల్లుండి (దసరా రోజు) తీర్మానం చేస్తారు. ఈ నెల 6వ తేదీన TRS నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి తీర్మాన పత్రాలను సమర్పిస్తారు. మునుగోడు ఉపఎన్నికలో కూడా BRS పేరుతోనే పోటీ చేయాలని అనుకున్నారు. కానీ పార్టీ పేరు మార్పు ప్రక్రియ ఇంకా మొదలుకాకముందే ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది.
మునుగోడు ఉపఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 14న నామినేషన్లకు చివరి తేదీ కాగా నవంబర్ 3న పోలింగ్.. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. మునుగోడు MLA పదవికి రాజీనామా చేసి BJPలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మళ్లీ ఉపఎన్నికలో పోటీ చేయబోతున్నారు. మునుగోడు ఉపఎన్నికను సెమీ ఫైనల్‌గా భావిస్తున్న BJP.. ఇప్పటికే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. TRS ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ముగ్గురి పేర్లను CM KCR పరిశీలిస్తున్నారు.