ట్రంప్‌కి నోబెల్ అందుకే రాలే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ ఆశలు ఆవిరయ్యాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎనిమిది యుద్ధాలు ఆపానని ఎంత అరిచినా.. పలు దేశాలు ట్రంప్‌కి మద్దతు తెలిపినా.. నోబెల్ కమిటీ మాత్రం వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడో పేరును ప్రకటించింది. వెనెజువెలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్‌ కమిటీ స్పష్టం చేసింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని తెలిపింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని.. గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని నోబెల్ కమిటీ చెప్పుకొచ్చింది.
అమెరికా కంటే ఇతర దేశాల గురించి ఎక్కువగా ఆలోచించి, బెదిరించి యుద్ధాలు ఆపినా ట్రంప్‌కు నోబెల్ దక్కలేదు. ఆయన పేరు మీద వచ్చిన నామినేషన్లు అన్నీ గడువు ముగిసిన తర్వాత వచ్చాయి. జనవరి 31కే ఆ గడువు ముగిసింది. కొన్ని దేశాల నుంచి మద్దతు వచ్చినప్పటికీ నోబెల్ రాకపోవడంపై నార్వే నోబెల్ కమిటీ ఛైర్మన్‌ క్లారిటీ ఇచ్చారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా విజేతలను ఎంచుకుంటామని చెప్పారు. నోబెల్ కమిటీ మీడియా, బహిరంగ ప్రచారాలను గమనిస్తోంది. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ ఆశయాలకు అనుగుణంగా మేం నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
నోబెల్‌ శాంతి బహుమతిని 1901 నుంచి 105 సార్లు ప్రకటించారు. ఇందులో 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని అందుకున్నాయి. ఈ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా పాకిస్థాన్‌కు చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ నిలువగా.. జోసెఫ్‌ రాట్‌బ్లాట్‌ 86 ఏళ్ల వయసులో దీనిని అందుకున్నారు.
అయితే, ఇప్పుడు ట్రంప్‌నకు నోబెల్ మిస్‌ అయినా.. 2026లో ఆయన మరోసారి పోటీ పడే అవకాశం ఉంది. శాంతి బహుమతి కోసం ఆయన యుద్ధం ఇప్పుడే మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Previous articleజూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్
Next articleIPL ఆక్షన్‌కు BCCI రెడీ.. ఫ్రాంచైజీలకు డెడ్‌లైన్