విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ధ్వంసమైన తన కారు దిగి.. స్నేహితుడి కారులో విజయ్ అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. విజయ్ తన స్నేహితులతో కలసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విజయ్ కారు డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
విజయ్ దేవరకొండ పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని.. తిరిగి హైదరాబాద్ చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాద ఘటనపై విజయ్ దేవరకొండ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, ఇంటికి చేరుకున్నానని Xలో పోస్ట్ చేశారు. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు.
