IAS ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ CAT ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. CAT ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ గత ఏడాది అక్టోబర్‌లో డీవోపీటీ ( కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ) ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆమ్రపాలి క్యాట్‌లో సవాల్ చేశారు. దీంతో ఆమ్రపాలిని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ మళ్లీ హైకోర్టులో అప్పీలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ…ఆమ్రపాలి పరస్పర బదిలీకి చేసుకున్న దరఖాస్తు నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని డీవోపీటీ వాదించింది.
కేంద్రం తెలంగాణ క్యాడర్‌కు కేటాయించిన సృజన, హరికిరణ్‌లతో పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకున్నారన్నారు. సృజన, ఆమ్రపాలిలకు వేర్వేరు వేతనాలున్నాయని, హరికిరణ్ రిజర్వు కేటగిరీకి చెందడంతో కేంద్రం అనుమతించలేదన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించాలంటూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు సరికాదన్నారు.
ఆమ్రపాలి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ క్యాట్‌లో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, స్టే మంజూరు చేయరాదని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆమ్రపాలి తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమ్రపాలిని HMDA జాయింట్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించారు. అయితే డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీ కేడర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.