బిహార్ (Bihar) సీఎం నీతీష్ కుమార్ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈసారి శాఖల విషయంలో భారీ మార్పులు జరిగాయి. దాదాపు 20 ఏళ్ల పాటు తన దగ్గర ఉన్న హోంశాఖను సీఎం నీతీష్.. బీజేపీకి ఇచ్చారు. అత్యంత కీలకమైన ఈ శాఖను ఈసారి BJP సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరికి కేటాయించారు.
మరో డిప్యూటీ సీఎం, BJP నేత విజయ్ కుమార్ సిన్హాకు రెవెన్యూ, భూసంస్కరణలు, భూగర్భగనుల శాఖను అప్పగించారు. సీఎం నీతీష్ దగ్గర సాధారణ పరిపాలన విభాగం, క్యాబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ శాఖలు మాత్రమే ఉన్నాయి.
మరోవైపు, జేడీయూతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ BJP దగ్గర ఉన్న ఆర్థిక శాఖను ఈసారి జేడీయూకే కేటాయించారు. దీంతో ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖలను జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్కు అప్పగించారు.
బిహార్లో ఎన్డీయే ఘన విజయం సాధించడంతో నితీష్ కుమార్ పదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు NDA కూటమి 202 సీట్లు గెలిచింది. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా BJP నిలిచింది. బీజేపీ 101 సీట్లలో పోటీ చేసి 89 చోట్ల విజయం సాధించింది. 101 సీట్లలో పోటీ చేసిన జేడీయూ 85 స్థానాలు దక్కించుకుంది.
నీతీష్ సహా 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 14 మంది బీజేపీ.. 9 మంది జేడీయూ. లోక్ జన్శక్తి (రాంవిలాస్) నుంచి ఇద్దరు, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం), హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు దక్కాయి. అయితే దాదాపు 20 ఏళ్లుగా తన దగ్గరే ఉన్న హోంశాఖను నితీష్.. బీజేపీకి అప్పగించడం చర్చనీయాంశమైంది.