ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు. ఘట్కేసర్లో నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ మోశారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
కవి, రచయిత, తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీకి అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికానని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బరువెక్కిన గుండెతో పాడె మోసి ఆయనతో నాకున్న అనుబంధపు రుణం తీర్చుకున్నానన్నారు.
తన గళంతో, కలంతో జాతిని జాగృత పరిచి, తెలంగాణ సమాజాన్ని నిత్య చైతన్యవంతంగా ఉంచేందుకు శ్రమించిన ఆయన తెలంగాణ గుండెల్లో ఎప్పటికి మరచిపోలేని జ్ఞాపకంగా ఉంటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
“జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” అని పాడే ప్రతి గొంతులో ఆయన ప్రతిధ్వనిస్తారని ట్వీట్ చేశారు.