పేర్ల మార్పుపై కేబినెట్ సబ్‌కమిటీ కసరత్తు పూర్తి..

APలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పుపై ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఫస్ట్ మీటింగ్ ఆగస్టు 13న జరిగింది. తర్వాత జిల్లాల వారీగా వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి కలెక్టర్లు వినతులు స్వీకరించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల నుంచి.. మొత్తంగా సుమారు 200 వరకు వినతులు సబ్ కమిటీకి అందాయి. వీటన్నింటిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.
రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో కమిటీ సమావేశం కానుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, పేర్ల మార్పులపై రాష్ట్రవ్యాప్తంగా అందిన వినతులపై CMతో చర్చిస్తారు. సీఎం సూచనలు తీసుకుని.. తుది నివేదిక రూపొందిస్తారు. నవంబరు 7న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం గెజిట్‌ విడుదల చేస్తారు. డిసెంబరు 31 లోగానే ఈ మొత్తం ప్రక్రియ పూర్తిచేసే అవకాశం ఉంది.
ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు 187 కిలో మీటర్ల దూరం ఉంది. దీంతో రంపచోడవరం, చింతూరు డివిజన్లతోపాటు 4 విలీన మండలాలతో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిసింది.
అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఉంది. సచివాలయం, అసెంబ్లీతోపాటు కొత్త భవనాల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త జిల్లా ఏర్పాటుపైనా కమిటీ ఫోకస్ పెట్టింది. సీఎంతో జరిగే సమావేశంలో ఈ అంశాలపై స్పష్టత రానుంది.
Previous articleప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సూచనలు
Next articleగూగుల్‌లో అమ్మాయిలు సెర్చ్ చేసే 5 టాపిక్స్