ట్రంప్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఇజ్రాయెల్

నోబెల్ శాంతి బహుమతి విషయంలో తీవ్ర నిరాశకు గురైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్ చెప్పింది. గాజా ఒప్పందం కుదిర్చి.. బందీల విడుదలకు కృషి చేసిన ట్రంప్‌కు అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.
శాంతి ఒప్పందం కుదిర్చినందుకు ట్రంప్‌కు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌ను ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ప్రకటించారు. రానున్న నెలల్లో సమయం, వేదిక నిర్ణయించి అందజేస్తామన్నారు. ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ ఇచ్చిన మద్దతు, దేశ పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం నెలకొల్పిన శాంతికి గుర్తుగా ట్రంప్‌ను ఈ విధంగా తాము గౌరవిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్‌ చేసిన సహాయాన్ని ఇజ్రాయెల్‌ ప్రజలు తరతరాలపాటు గుర్తించుకుంటారన్నారు. కాగా 2013లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య చేసిన కాల్పుల విరమణ ఒప్పందమే తాను ఇప్పటివరకు చేసిన అతిపెద్ద ఒప్పందమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్‌ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించాయి. శుక్రవారం నుంచే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే బందీల విడుదల ఇవాళ మొదలైంది. ఒప్పందం కింద తమ దగ్గర ఉన్న 48 మంది బందీలను హమాస్‌ విడిచిపెట్టనుంది. అయితే, ఇందులో 20 మందే సజీవంగా ఉన్నారు. వీరిని గాజాలోని మూడు ప్రాంతాల్లో హమాస్‌ విడుదల చేసింది.
దాదాపు రెండేళ్లుగా హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారికి ఇవాళ విముక్తి లభించింది. తొలుత ఏడుగురు బందీలను రెడ్‌క్రాస్‌కు హమాస్‌ అప్పగించింది. ఆ తర్వాత మిగతా 13 మంది బందీలను విడిచిపెట్టింది. హమాస్‌ దగ్గర ఉన్న 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను కూడా త్వరలోనే అప్పగించనుంది.
Previous articleవరుస ఓటములు.. భారత్ సెమీస్ చేరాలంటే..
Next articleకేటీఆర్ ఆరోపణలపై విచారణకు ఆదేశం