ఏ క్షణమైనా బిహార్ అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా పలు ఉప ఎన్నికలకు షెడ్యూల్ను రిలీజ్ చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే పట్నాలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బిహార్ అసెంబ్లీ షెడ్యూల్ ప్రకటించినప్పుడే తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీని కూడా ఈసీ ప్రకటించనుంది.
దీపావళి పండగ అనంతరం ఆరు రోజులకు వచ్చే ఛఠ్ పూజా మహోత్సవాన్ని బిహార్ ప్రజలు నాలుగు రోజులపాటు జరుపుకుంటారు. ఈ ఏడాది ఛఠ్ పూజా ఈ నెల 25న ప్రారంభమై 28న ముగుస్తుంది. బిహారీలు దేశంలో ఎక్కడున్నా ఛఠ్ పూజా కోసం స్వస్థలాలకు వస్తారని, ఇందుకు అనుగుణంగానే పోలింగ్ తేదీలను ఖరారు చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు CECని కోరారు.
243 స్థానాలు కలిగిన బిహార్ అసెంబ్లీకి గడువు 2025 నవంబర్ 22తో ముగియనుంది. ఆ గడువులోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెలాఖరు, నవంబర్ నెలల్లో వివిధ దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2020లో మూడు విడతల్లో.. 2015లో మాత్రం ఐదు విడతల్లో పోలింగ్ జరిగింది. అయితే ఈసారి ఒకటి, రెండు దశలకే పరిమితం చేయాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు CECకి సూచించారు.
అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 మధ్యలో తొలి దశ, నవంబర్ 5 నుంచి 7 మధ్య రెండో దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నవంబర్ 10న ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.