ఇదే చివరి బొట్టు మామా.. ఇక మళ్లీ ముడితే ఒట్టు..డిసెంబర్ 31 అర్ధరాత్రి చాలామంది చెప్పే మాటిదే.. అయితే తెల్లారి మత్తు దిగగానే హాంగోవర్ పెగ్గంటూ మళ్లీ కొత్తగా మొదలెడుతుంటారు.. ఇలా కొత్త ఏడాది కోసం పెట్టిన ఒట్టును గట్టు మీద పెట్టేస్తుంటారు.
జనవరి 1 వస్తుందంటే చాలు… జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి అంతా సిద్ధమవుతుంటారు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పేరుతో శపథాలు, తీర్మానాలు, ప్రతిజ్ఞలు చేస్తుంటారు. మద్యం మానేస్తామని ఒకరు, సిగరెట్ ముట్టనని ఇంకొకరు, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటామని మరొకరు, ఇలా ఒక్కొక్కరూ తమ జీవితాలను కొత్తగా మార్చేందుకు శపథాలు చేస్తుంటారు. మంచిదే… కొత్త సంవత్సరంలో జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోవడం కన్నా ఇంకేం కావాలి. మరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అందరూ 100% అమలు చేస్తారా? అంటే అస్సలు కాదనే చెప్పాలి.
ముందు మానేస్తామని శపథం చేసేవారిలో కేవలం 7శాతం మంది మాత్రమే విజయవంతంగా అమలుచేశారని ఓ సర్వేలో తేలింది. మిగతా 93శాతం మంది కొత్త సంవత్సర శపథాలను అటకెక్కించేశారట. అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పాటించకపోవడానికి కారణం ఏంటా అని పరిశీలిస్తే… ఆచరణ సాధ్యం కాని శపథాలు చేసి… ఆ తర్వాత అమలు చేయలేక ఇబ్బందిపడడం. అందుకే ఆచరణ సాధ్యం కాని ప్రతిజ్ఞలు చేయడం కన్నా, మీవల్ల ఏది సాధ్యమవుతుందో అలాంటి తీర్మానాలే చేయాలి.
ఇక మొత్తానికే సిగరెట్, మందు, షుగర్ తీసుకోవడం మానేస్తామని శపథాలు చేస్తారు కానీ… ఆచరణ సాధ్యం కాదు. అందుకే… సిగరెట్లు తాగడం తగ్గించడం అంటే రోజూ పది తాగేవాళ్లు ఇక మూడు నాలుగే తాగుతామని, ఇక మద్యం విషయానికొస్తే వీకెండ్స్‌లో మాత్రమే తాగుతామని ప్రతిజ్ఞ చేయడం మంచిది. అలా మొదట్లో పరిమితి తగ్గిస్తేనే ఆ తర్వాత పూర్తిగా మానెయ్యడం సాధ్యమవుతుంది. రాత్రికి రాత్రే అలవాట్లు వదిలించుకోవాలనుకోవడం, కొత్త అలవాట్లు చేసుకోవాలనుకోవడం ఎవరికైనా కష్టమే.
కాబట్టి ఆచరణ సాధ్యమయ్యే గోల్స్ పెట్టుకోవడం వల్ల… మీకు కూడా అనుకున్నది సాధిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. లేకపోతే అనుకున్నట్టుగా చేయలేకపోతున్నామని, శపథాలన్నీ కోతలకే పరిమితం అయ్యాయన్న బాధ మిగులుతుంది. సో… పైన చెప్పినట్లు ఫస్ట్ తగ్గించండి..తర్వాత మానేయండి.